'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సు'.. సీఎం రేవంత్‌ ప్రకటన

డిసెంబర్‌ 8 నుంచి భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.

By -  అంజి
Published on : 6 Dec 2025 6:59 AM IST

CM Revanth Reddy, Telangana Rising Global Summit, economic conference, Telangana

'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సు'.. సీఎం రేవంత్‌ ప్రకటన

డిసెంబర్‌ 8 నుంచి భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ప్రణాళికలను ప్రతిబింబించే తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం, తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025 ఏర్పాట్లపై ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు.

సమ్మిట్ కోసం భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వేదికగా జరుగుతున్న ఏర్పాట్లు, వరుసగా రెండు రోజుల కార్యక్రమాల ప్రణాళిక అంశాలను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. విజన్ డాక్యుమెంట్‌కు తుది రూపు ఇచ్చే విషయంలో సీఎం పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలకు విజన్ డాక్యుమెంట్‌లో ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ విజన్ డాక్యుమెంట్ డిజిటల్ రూపంలో పారదర్శకంగా, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలు, దాని ప్రాముఖ్యత, ప్రభుత్వ దార్శనికతను దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదికలో తెలియజెప్పేలా ఉండాలన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే సదస్సు ఏర్పాట్లపై అధికారులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి శనివారం రోజున గ్లోబల్‌ సమ్మిట్‌ మినిట్ టూ మినిట్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఇండిగో తదితర విమానాలు రద్దవుతున్న పరిస్థితుల నేపథ్యంలో, సమ్మిట్‌కు హాజరయ్యే అతిథులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Next Story