Telangana: మూడు దశల్లో 111 ఏటీసీలు.. సీఎం రేవంత్‌ సమీక్ష

తెలంగాణ రైజింగ్-2047 విజన్‌కు అనుగుణంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

By అంజి
Published on : 22 July 2025 9:20 AM IST

CM Revanth Reddy, ATCs, Telangana, Advanced Technology Centers

Telangana: మూడు దశల్లో 111 ఏటీసీలు.. సీఎం రేవంత్‌ సమీక్ష

తెలంగాణ రైజింగ్-2047 విజన్‌కు అనుగుణంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ఏటీసీల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రి వివేక్‌తో పాటు ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా “ఏటీసీలు తెలంగాణ యువతకు అత్యాధునిక శిక్షణా సంస్థలు” అన్న పేరుతో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

మారుతున్న పరిస్థితులు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ఐటీఐలను ATC లుగా మార్చడంలో జరుగుతున్న అభివృద్ధి, పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు దశల్లో 111 ATC లను అభివృద్ధి చేపట్టినట్టు అధికారులు వివరించారు. అందులో మొదటి దశలో 25, రెండో దశలో 40, మూడో దశలో 46 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. మొదటి రెండు దశలకు సంబంధించి ఇప్పటికే 49 ఏటీసీలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

ఏటీసీలను వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. జరుగుతున్న పనులను పరిశీలించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని చెప్పారు. అలాగే, జినోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఫార్మా, బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా శిక్షణ అందించే కోర్సులను అక్కడ నిర్వహించాలని చెప్పారు. అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు అధునాతన సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను తయారు చేయాలన్నారు.

Next Story