బాసర నుంచి భద్రాచలం వరకు ఘాట్ల అభివృద్ధి..2027 పుష్కరాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2027 జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణపై శాసనసభ సమావేశ హాలులో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
By - Knakam Karthik |
బాసర నుంచి భద్రాచలం వరకు ఘాట్ల అభివృద్ధి..2027 పుష్కరాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2027 జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణపై శాసనసభ సమావేశ హాలులో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మరియు ఉన్నతాధికారులతో కలిసి ఆయన భవిష్యత్తు కార్యాచరణను చర్చించారు. ఈ సందర్భంగా పుష్కరాల ఏర్పాట్ల కోసం రూపొందించిన ప్రణాళికలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా, ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పుష్కర నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు ఇంజనీర్లతో కూడిన ఒక టెక్నికల్ కమిటీని నియమించాలని, ఈ కమిటీ 15 నుంచి 20 రోజుల్లో క్షేత్రస్థాయి నివేదికను సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి, పూర్తి అంచనాలతో మంత్రివర్గ ఉపసంఘానికి పంపాలని, అనంతరం రాష్ట్ర మంత్రిమండలి తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పుష్కరాల పనులను శాశ్వత మరియు తాత్కాలిక ప్రాతిపదికన వర్గీకరించి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సూచించడమే కాకుండా, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రజా భవన్‌లో ప్రత్యేకంగా ఒక 'వార్ రూమ్' ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో ఘాట్ల నిర్మాణం, విస్తరణతో పాటు భక్తుల సౌకర్యార్థం రవాణా కనెక్టివిటీని మెరుగుపరచాలని చెప్పారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను కూడా ఈ సమావేశంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు, సి.ఎస్. మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.