హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలి..అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సెక్రటరీ మాణిక్ రాజ్, MA&UD (HMDA Area) సెక్రటరీ ఇలంబర్తి, HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, GHMC కమిషనర్ RV కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, FCDA కమిషనర్ కే.శశాంక, HMWSSB ఎండీ అశోక్ రెడ్డి, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, MRDCL ఎండీ EV నర్సింహ రెడ్డి, జేఎండీ గౌతమి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. కోర్ అర్బన్ రీజియన్ లో కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఇందుకు సంబంధించి ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాల్లో సమస్యలను అధ్యయనం చేయాలి. హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకుండా పరిష్కార మార్గాలను సిద్ధం చేయాలి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి..అని సీఎం సూచించారు.