తెలంగాణ ఉద్య‌మ ఆయువుప‌ట్టు గ‌ద్ద‌ర‌న్న: సీఎం రేవంత్

ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మానికి ఆయువుప‌ట్టుగా నిలిచిన వ్య‌క్తి గ‌ద్ద‌ర‌న్న అని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు

By Knakam Karthik
Published on : 6 Aug 2025 12:40 PM IST

Telangana, CM Revanthreddy, Gaddar Death Anniversary

తెలంగాణ ఉద్య‌మ ఆయువుప‌ట్టు గ‌ద్ద‌ర‌న్న: సీఎం రేవంత్

ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మానికి ఆయువుప‌ట్టుగా నిలిచిన వ్య‌క్తి గ‌ద్ద‌ర‌న్న అని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ఆయ‌న చేసిన సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్మ‌రించుకున్నారు. గ‌ద్ద‌ర్ చిత్ర‌ప‌టానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి గ‌ద్ద‌ర్‌తో త‌న‌కు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పేద కుటుంబంలో పుట్టి ఇంజినీరింగ్ విద్య‌ను అభ్య‌సించిన గ‌ద్ద‌ర్‌ ఉన్న‌త కొలువుల వైపు దృష్టిసారించ‌కుండా ప్ర‌తి ఒక్క‌రికి కూడు, గూడు, నీడ ల‌భించాలనే ల‌క్ష్యంతో జీవితాంతం త‌న పాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌ర్చార‌న్నారు.

ప‌లు ఉద్య‌మ సంస్థ‌ల ఏర్పాటుతో తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మానికి ఊపిరులూదిన వారిలో అగ్ర‌గ‌ణ్యుడు గ‌ద్ద‌ర్ అని గుర్తు చేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని, పాట‌ను తూటాగా మార్చిన ప్ర‌జా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ అని సీఎం కొనియాడారు. గ‌ద్ద‌ర్ చేసిన సాంస్కృతిక‌, సాహితీ సేవ‌లకు గుర్తింపుగా జూన్ 14వ తేదీన గద్దర్ పేరిట తెలంగాణ ఫిల్మ్ అవార్డులను సినీ కళాకారులకు, సినీ ప్రముఖులకు అందించామ‌న్నారు. గద్దర్ జయంతి, వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, వారి ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు త‌మ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్య‌క్ర‌మంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Next Story