నేతన్నకు చేయూత.. రూ.290 కోట్లు విడుదల చేసిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లో ప్రారంభించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు స్వతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ నిర్ణయించారు.

By అంజి  Published on  9 Sep 2024 9:53 AM GMT
CM Revanth Reddy, Nethannaku Cheyutha Scheme, IIHT, Hyderabad

నేతన్నకు చేయూత.. రూ.290 కోట్లు విడుదల: సీఎం రేవంత్‌ 

హైదరాబాద్‌లో ప్రారంభించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు స్వతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ లో ఐఐహెచ్‌టీ సంస్థకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టడం సముచితంగా ఉంటుందని, వెంటనే అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలిచ్చారు. అలాగే నేతన్నకు చేయూత పథకానికి సంబంధించిన నిధులను సీఎం రేవంత్ విడుదల చేశారు. దీంతో 36,133 మంది అర్హులు లబ్ధిపొందనున్నారు. IIHT ప్రారంభోత్సవంలో భాగంగా నేతన్నకు చేయూత పథకం కింద రూ.290 కోట్ల నిధులను విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమాజంలో ఆత్మగౌరవంతో బతకడానికి రైతన్న ఎంత ముఖ్యమే నేతన్న కూడా అంతే ముఖ్యమని అన్నారు. నేతన్న రుణాలు 30 కోట్ల రూపాయల మేరకు ఉన్నట్టయితే వాటిని మాఫీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 63 లక్షల మంది మహిళలకు ప్రతి ఏటా ఒక్కొక్కరి రెండు మంచి డిజైన్ తో కూడిన నాణ్యమైన చీరలను అందించాలని, ఏడాదికి 1.30 కోట్ల చీరలను నేతన్నలకు ఆర్డర్ ఇస్తామని తెలిపారు. నేతన్నల కోసం పెండింగ్‌ బిల్లులు కలిపి మొత్తంగా రూ. 335 కోట్ల విడుదల చేస్తామని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు.

హ్యాండ్లూమ్ టెక్నాలజీలో తెలంగాణ విద్యార్థులు చదువుకోవాలంటే బయటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులను గమనించి IIHT ని హైదరాబాద్‌ కు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌ని కలిసి కోరడం జరిగిందని, రాజకీయాలకు అతీతంగా ఐఐహెచ్‌టీ ఆమోదించారని సీఎం రేవంత్‌ వివరించారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభించడానికి నాంపల్లిలో ఖాళీగా ఉన్న తెలుగు యూనివర్సిటీ భవనంలో ఈ సంస్థను ప్రారంభిస్తున్నామని, ఈ సంస్థలో చేరిన విద్యార్థులకు నెలకు రూ.2,500 చొప్పున స్కాలర్ షిప్ మంజూరు చేస్తున్నామని తెలిపారు.

Next Story