వరద బాధితులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక హామీలు

తెలంగాణలో మూడ్రోజులుగా వర్షాలు పడుతున్నాయి

By Srikanth Gundamalla  Published on  3 Sept 2024 8:41 AM IST
వరద బాధితులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక హామీలు

తెలంగాణలో మూడ్రోజులుగా వర్షాలు పడుతున్నాయి. దాంతో.. చాలా చోట్ల వరదలు పోటెత్తాయి. కొన్ని చోట్ల చాలా నష్టం వాటిల్లింది. పంటలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ఆస్తినష్టం సంభవించింది. జీనజీవనం స్తంభించి పోయింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు పోటెత్తడంతో వరదలు సంభవించాయి. ఈ క్రమంలో వరదలపై మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ఖమ్మం పట్టణంలో మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలైన రాజీవ్ గృహకల్ప కాలనీ, ఎఫ్‌సీఐ రోడ్డు, బొక్కలగడ్డ కాలనీ, పెద్ద తండా తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.

భారీ వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. నష్టపోయిన వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకున్నా.. 16 మంది ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందని అన్నారు. వేల కోట్ల ఆస్తులు, లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం చేస్తామన్నారు. పాడి పశువులు చనిపోతే రూ.50 వేలు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.5 వేలు ఇస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అలాగే.. తెలంగాణలో వరద పరిస్థితులను ప్రదాని మోదీకి వివరంచామన్నారు. తక్షణమే నష్ట నివారణకు సహకరించాలని అడిగిన విషయాన్ని సీఎం ప్రజలకు వివరించారు. తాత్కాలిక ఉపశమనంగా ప్రాథమిక అంచనా ప్రకారం కేంద్రాన్ని రూ.5,438 కోట్ల రూపాయాలు ఇవ్వాలని కోరామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఖమ్మంలో 34 క్యాంపులు 2,119 కుటుంబాల్లో 7,467 మందికి రాష్ట్ర ప్రభుత్వం వసతి ఏర్పాటు చేసిందన్నారు. రెస్క్యూ, రిపేర్, రిస్టోర్, రిపోర్టుతో జిల్లా యంత్రాంగం రాబోయే 5 రోజులూ కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు. వర్షాలు మరిన్ని రోజులు పడే అవకాశం ఉన్నందున ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.

Next Story