కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. "అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో టెక్ విజనరీలలో ఒకరిగా ఉన్న శంతను నారాయణ్‌ను కలవడం భావోద్వేగానికి గురిచేసింది" అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
శుక్రవారం నాడు కాలిఫోర్నియాలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. అలాగే పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ మట్లాడుతూ.. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం అని పిలుపునిచ్చారు. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యునికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్‌ను సందర్శించాలని ఆహ్వానించారు. అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సదుపాయాలను పరిశీలించాలని కోరారు.