ఈ విష‌యంలో రాజకీయాలు చేయడం సమంజసం కాదు : సీఎం రేవంత్

దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎక్కడా రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు

By Medi Samrat  Published on  15 Oct 2024 1:08 PM GMT
ఈ విష‌యంలో రాజకీయాలు చేయడం సమంజసం కాదు : సీఎం రేవంత్

దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎక్కడా రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత నావికాదళం విఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా పూడూరు మండల ప్రాంతాన్ని వ్యూహాత్మక ప్రాంతంగా ఎంచుకుందని అన్నారు. దీనిపై రాజకీయాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. VLF రాడార్ కేంద్రం వల్ల స్థానికులకు గానీ.. ఈ ప్రాంతానికి గానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు.

భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజున నావికా దళం నిర్మించనున్న వీఎల్ఎఫ్ రాడార్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రాజెక్టుకు సంబంధించి పలు కీలక అంశాలను వివరించారు.

రక్షణ శాఖకు హైదరాబాద్ మొదటి నుంచి వ్యూహాత్మక ప్రాంతంగా ఉంది. అనేక రక్షణ పరిశోధనా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. రాజకీయాల్లో సైద్ధాంతిక వైరుధ్యాలు ఉండొచ్చు. కానీ దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేయడం సరికాదు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

ఈ ప్రాజెక్టు ఏర్పాటు నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. రక్షణ శాఖ మంత్రి అడిగిన వెంటనే మేం కార్యాచరణను ముందుకు కొనసాగించాం. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరం. ఈ ప్రాజెక్టు కారణంగా స్థానికులకు, పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదని పేర్కొన్నారు.

1990 లో తమిళనాడులో ఏర్పాటు చేసిన వీఎల్ఎఫ్ వల్ల ప్రజలకు, ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇక్కడ 400 ఏళ్ల నాటి రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. మందిరానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. నావికా దళం ఇక్కడ ఏర్పాటు చేసే విద్యా సంస్థల అడ్మిషన్లలో స్థానికులకు మూడింట ఒకవంతు అవకాశం కల్పించాలి. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని పేర్కొన్నారు.

APJ Abdul Kalam జయంతి సందర్భంగా ఈ వీఎల్ఎఫ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకోవడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. దీని ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చూపిన చొరవను అభినందించారు. రక్షణ శాఖలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి సమగ్రంగా వివరించారు.

Next Story