గుడ్‌న్యూస్.. ఇంటి నిర్మాణానికి రూ.5,00,000.. యాప్ ప్రారంభించిన సీఎం రేవంత్
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ప్రత్యేక యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
By అంజి Published on 5 Dec 2024 12:38 PM ISTగుడ్‌న్యూస్.. ఇంటి నిర్మాణానికి రూ.5,00,000.. యాప్ ప్రారంభించిన సీఎం రేవంత్
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ప్రత్యేక యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మొబైల్ యాప్ ద్వారా రేపటి నుంచి లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. ఆత్మగౌరవంతో బతకాలనేదే పేదల కల అని, రోటీ, కపడా, ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదమని సీఎం అన్నారు. అందుకే ఆమె దశాబ్దాల క్రితమే ఇళ్లు, భూపంపిణీ పథకాలను ప్రారంభించారని వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. అర్హులైన వారికే ప్రభుత్వ ఇళ్లు దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తొలి ఏడాదిలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు.
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. తొలి దశలో ఎస్‌సీ, ఎస్‌టీ, ట్రాన్స్‌జెండర్లు, అత్యంత పేదలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఆదివాసీ ప్రాంతాల్లో జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కోటా అమలు చేస్తామన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో పేదలకు ఇళ్లు కేటాయించలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ తనకు అవసరమైన ప్రగతిభవన్‌ను ఆఘమేఘాల మీద పూర్తి చేశారని, వాస్తు కోసం సచివాలయాన్ని కూలగొట్టి కొత్తదాన్ని వేగంగా నిర్మించుకున్నారని, ప్రతి జిల్లాలో బీఆర్‌ఎస్ కార్యాలయాలను కట్టుకున్నారని అన్నారు. గజ్వేల్, జన్వాడ ఫామ్‌హౌస్‌ల నిర్మాణంపైనే కేసీఆర్ దృష్టి పెట్టారు కానీ.. పేదల ఇళ్ల పథకానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదని సీఎం విమర్శించారు.