ఉస్మానియా హాస్పిటల్ న్యూ బిల్డింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

హైదరాబాద్‌లో గోషామహల్‌లో ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనం నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భూమి పూజ చేశారు.

By Knakam Karthik  Published on  31 Jan 2025 1:25 PM IST
Telangana, Hyderabad, CM Revanth Reddy New, laid foundation stone for new building of Osmania Hospital

ఉస్మానియా హాస్పిటల్ న్యూ బిల్డింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

హైదరాబాద్‌లో గోషామహల్‌లో ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనం నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భూమి పూజ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామెదర రాజనర్సింహాతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రంలో మెరుగైన వైద్యం అందించేందుకు కొత్తగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ ఆస్పత్రిని రూపొందిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఉస్మానియా ఆసుప‌త్రి అఫ్జ‌ల్‌గంజ్‌లో ఉండ‌గా.. కొత్త ఆసుపత్రిని గోషామ‌హ‌ల్ స్టేడియంలో నిర్మించ‌నున్నారు. 2 వేల ప‌డ‌క‌ల సామ‌ర్ధ్యంతో మొత్తం 32 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నూత‌న ఆసుప‌త్రిని నిర్మించ‌నున్నారు. 26 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించ‌నున్న ఉస్మానియా ఆసుప‌త్రి కొత్త భవనాలు కార్పొరేట్ ఆసుప‌త్రుల‌ను త‌ల‌ద‌న్నేలా ఉండాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

రాబోయే వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఉస్మానియా ఆసుప‌త్రిని నిర్మించాల‌ని ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి.. అధికారుల‌ను ఆదేశించారు. అందుకు అనుగుణంగా.. అన్నిరకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్ర‌తి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్‌ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్‌ కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్ల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు.

అండ‌ర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్ల‌లో పార్కింగ్‌, ఆసుప‌త్రి స‌మీపంలో ఫైర్ స్టేష‌న్‌, ఆసుప‌త్రి చుట్టూ విశాల‌మైన ర‌హ‌దారులు, ఆసుప‌త్రి ప్రాంగంణంలో ఎక్క‌డికైనా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు తిరిగే మార్గాలు, దివ్యాంగులు ఆసుప‌త్రిలోకి రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా ర్యాంప్‌లు, ఆసుప‌త్రిలోని రోగుల‌కు స‌హాయ‌కులుగా వ‌చ్చే వారు సేద తీరేందుకు డార్మెట‌రీలు, క్యాంటీన్‌, మ‌రుగుదొడ్లు వంటి సమస్త సౌకర్యాలతో అత్యాధునికంగా నిర్మించ‌నున్నారు.

అయితే ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని గోషామహల్ పరిరక్షణ సమితి వ్యతిరేకిస్తోంది. ఆస్పత్రి నిర్మాణం వల్ల స్థానికులకు ఇబ్బందులు కలుగుతాయని ఆరోపిస్తోంది. ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతోంది. గోషామహల్‌లో కాకుండా ఇంకెక్కడైనా నిర్మించాలని డిమాండ్ చేస్తోంది. ఈ రోజు ఆస్పత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసిన నేపథ్యంలో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

Next Story