తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్టకు బోర్డు ఏర్పాటు
తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట దేవాలయానికి బోర్డు ఏర్పాటు కు ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు
By Medi Samrat Published on 8 Nov 2024 4:03 PM GMTతిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట దేవాలయానికి బోర్డు ఏర్పాటు కు ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తన జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, పూజారులు, వేద పండితులు రాష్ట్ర ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ముఖ్యమంత్రి యాదగిరిగుట్ట పైనే ఉన్న ప్రసిడెన్షియల్ సూట్ లో యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధిపై యదగిరి గుట్ట టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులు, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతకుమారి, ఆర్ అండ్ బి, దేవాదాయ, ఇంజనీరింగ్, తదితర శాఖల రాష్ట్ర సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో సమీక్షించారు.
ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయానికి సంబంధించి చేపట్టిన పనులు, ఇంకా పెండింగ్ లో ఉన్న పనులు, చెల్లింపులు తదితర అన్ని అంశాలను అడిగి తెలుసుకున్నారు. కాగా యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి అథారిటీ వైస్ చైర్మన్ కిషన్ రావు యాదగిరి గుట్ట దేవాలయ అభివృద్ధికి చేసిన పనులు, పెండింగ్ లో ఉన్న పనులు, ఖర్చు, భవిష్యత్ ప్రణాళిక తదితర అంశాల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట దేవాలయ చైర్మన్ పదవికి గౌరవాన్ని పెంచే విధంగా ప్రాధాన్యతనివ్వాలని, యాదగిరి గుట్టకు తిరుపతి లాగే ఒక బోర్డును ఏర్పాటు చేయాలని, గోశాలను బెస్ట్ మోడల్ గోశాలగా అభివృద్ధి చేయాలని, భక్తులు గోవులను, గోశాల అభివృద్ధిని దత్తత తీసుకునే విధంగా ప్రత్యేకించి ఒక యాప్ ఏర్పాటు చేయాలని, యాదగిరిగుట్టకు సంబంధించిన టెంపుల్ కమిటీ, ఇతర కమిటీలను పునర్నిర్మించాలని, గోసంరక్షణకు ఒక పాలసీని ప్రత్యేకంగా రూపొందించాలని, యాదగిరిగుట్టలో ఒకరోజు నిద్ర చేయడం భక్తులకు ఆనవాయితిగా వస్తున్న ఆచారమని, దానికి ప్రాధాన్యతనిస్తూ ప్రణాళిక రూపొందించాలని, కేశఖండన, నిద్ర చేసేందుకు దేవాలయ ఆగమశాస్త్ర ప్రకారం భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా వీటన్నిటిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.నిధుల కోసం చిన్న చిన్న పనులు పెండింగ్ లో ఉంచకుండా, నూరు శాతం పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించి నవంబర్ 15లోగా దేవాలయానికి సంబంధించిన అన్ని అంశాలతో సమీక్షకు రావాలని అధికారులను ఆదేశించారు.ఈ విషయం పై ప్రధాన కార్యదర్శి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఆర్ అండ్ బి ,దేవాదాయ, తదితర ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ లు వెంటనే దేవాలయాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని, తాను మరోసారి దేవాలయాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేస్తానని, దేవాలయ అన్ని పనులకు సంబంధించి ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే పూరించాలని, గుడి ,గుడి చుట్టూ ఉండే అన్ని అంశాలపై రాజీ పడేది లేదని అన్నారు.దేవాలయ భూసేకరణకు సంబంధించి అన్ని కేసులు క్లియర్ చేయాలని, అలాగే చెల్లింపులు సైతం చేయాలని, తదుపరి సివిల్ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని, సాంప్రదాయానికి సంబంధించిన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
కాగా యాదాద్రి భువనగిరి జిల్లా మెడికల్ కళాశాలకు మరికొంత స్థలం కావాలని, ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బీర్ల ఐలయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, మెడికల్ కాలేజీని దేవాలయ పరిధి లో వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాలని, దీనిపై అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇకపై అన్ని అంశాలలో యాదాద్రి స్థానంలో యాదగిరిగుట్ట అని కనిపించాలని, ఆన్లైన్, ఉత్తర ప్రత్యుత్తరాలు, దేవాలయానికి సంబంధించిన టికెట్లు అన్నింటిపై యాదగిరిగుట్ట అనే పదాన్ని వాడాలని ఆయన ఆదేశించారు. కాలేజీలో నిర్మాణానికి దాతల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో విమాన గోపురానికి బంగారు తాపడం, వేద పాఠశాల నిర్మాణం వంటి అంశాలపై ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమీక్ష లో షాపింగ్ కాంప్లెక్స్, వసతి గృహాల నిర్మాణం, కళ్యాణకట్ట ,పుష్కరిణి ,వసతి గృహాలు, అన్నప్రసాదం కాంప్లెక్స్, బస్టాండ్ , ప్రేసిడెన్షియల్ విల్లాస్, వసతి తదితర అంశాలపై సమీక్షించారు.