స్థానిక ఎన్నికల తేదీలపై నిర్ణయం..ఇవాళ కేబినెట్‌ భేటీలో కీలక అంశాలపై చర్చ

స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై నేడు జరిగే మంత్రి వర్గం సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

By -  Knakam Karthik
Published on : 25 Nov 2025 7:12 AM IST

Telangana, Cm Revanthreddy, Telangana Cabinet, Panchayat Polls

స్థానిక ఎన్నికల తేదీలపై నిర్ణయం..ఇవాళ కేబినెట్‌ భేటీలో కీలక అంశాలపై చర్చ

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై నేడు జరిగే మంత్రి వర్గం సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలు, విద్యుత్ రంగంపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాగా ప్రభుత్వం కోర్టుల సూచనలను అనుసరించి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% లోపు మాత్రమే ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లు ఇవాళే సంబంధిత గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశం ఉంది.

దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగం పందుకుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను ఎస్ఈసీకి పంపించింది. రిజర్వేషన్లు, నోటిఫికేషన్లు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం తేదీలను ఖరారు చేయడానికి సిద్ధమవుతోంది. దీంతో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్రంలో రాజకీయ ఉత్సుకత పెరిగింది.

నేడు హైకోర్టులో విచారణ

మరో వైపు తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కీలక పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో విచారణను కోర్టు తర్వాతి తేదీకి మార్చింది. కాగా ఈ పిటీషన్‌పై నేడు హైకోర్టు మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ వ్యవహారాలపై పలు పిటిషన్‌లు పెండింగ్‌లో ఉండటంతో ఈ విచారణకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

Next Story