హైదరాబాద్: సామాన్య రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా, అత్యాధునికంగా, 100 ఏళ్లపాటు నడిచేలా భూ భారతి వెబ్‌సైట్‌ను రూపొందించాలని, భద్రత కోసం ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసి, నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి.. భూ భారతి పథకంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ భారతి వెబ్‌సైట్ సరళంగా, పారదర్శకంగా ఉండాలని, భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా దాన్ని రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే.. రేపటి నుంచి అమల్లోకి తీసుకురానున్న భూభారతి పోర్టల్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి రాష్ట్రమంతటా పోర్టల్‌ను లాంచ్ చేస్తే తప్పులు సరి చేయడం ఇబ్బందవుతుందన్నారు. అందుకే పైలట్ ప్రాజెక్టుగా తొలుత మూడు మండలాల్లో అమలు చేస్తామని చెప్పారు. సామాన్యుడికి సైతం సులువుగా అర్థం అయ్యేలా పోర్టల్ ఉంటుందని స్పష్టం చేశారు. ధరణిలో గత ప్రభుత్వం చేసిన అక్రమాలను బయటపెడతామన్నారు.