మా రాష్ట్రానికి వచ్చి నన్నే బెదిరిస్తారా?: సీఎం రేవంత్
రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే బీజేపీ కుట్రకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 1 May 2024 3:26 PM ISTమా రాష్ట్రానికి వచ్చి నన్నే బెదిరిస్తారా?: సీఎం రేవంత్
రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే బీజేపీ కుట్రకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కోరుట్లలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ మాట్లాడారు. నిన్న తెలంగాణకు వచ్చిన మోదీ ఈ ప్రాంతానికి ఇచ్చిన హామీల గురించి ఏం మాట్లాడలేదని మండిపడ్డారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని అన్నారు. మోదీ అబద్ధాలు చెబుతున్నారని, రాజ్యాంగాన్ని మార్చడానికి కమిషన్ వేశారని ఆరోపించారు. దమ్ముంటే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి ఓట్లు అడగండి అని అన్నారు.
రిజర్వేషన్లు రద్దు చేయడం, రాజ్యాంగాన్ని బీజేపీ ఎలా మార్చాలనుకుంటుందో అని రుజువులతో సాయంత్రం ఐదు గంటలకు బయటపెడతానని తెలిపారు. అప్పుడు జనాలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని సూచించారు. ''ప్రచారం మానేసి ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరుకావాలా? మా రాష్ట్రానికి వచ్చి నన్నే బెదిరిస్తారా?'' అని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ''ఖబర్దార్ ప్రధాని నరేంద్ర మోదీ.. మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తే బీజేపీకి నిజాం, రజాకార్ల గతి తప్పదు. ఇది తెలంగాణ ప్రైడ్ వర్సెస్ గుజరాత్ శక్తుల మధ్య పోరు. మీరు మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తే మీకు 0-1 సీట్లు రావు'' అని అన్నారు.
కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే కాంగ్రెస్ ఇచ్చి రిజర్వేషన్లు రద్దు చేయడమేనా? అన్ని సౌకర్యాలను దూరం చేయడమేనా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. రిజర్వేషన్ల గురించి ప్రశ్నిస్తే తనపై ఢిల్లీలో కేసు పెట్టారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే భయపెట్టాలని చూశారని మండిపడ్డారు. అప్పుడు భయపడలేదని, ఇప్పుడు వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం తమకు రిజర్వేషన్లు ఇవ్వాలని బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు కోరగా.. రాహుల్ గాంధీ ఒప్పుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. జన గణన చేయించి బీసీలకు న్యాయం చేస్తామని తెలిపారు. అయితే బీజేపీ మాత్రం రిజర్వేషన్లు తీసేయడానికి ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.