అకారణంగా కరెంట్ కట్‌ చేస్తే అధికారులపై చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో విద్యుత్‌ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు.

By Srikanth Gundamalla  Published on  23 Feb 2024 7:24 AM IST
cm revanth reddy, fire,  power cuts,  telangana ,

 అకారణంగా కరెంట్ కట్‌ చేస్తే అధికారులపై చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో విద్యుత్‌ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించొద్దని చెప్పారు. ఒకవేళ అలా చేస్తే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడం.. సస్పెన్షన్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అవసరాలకు సరిపడేంత విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తరఫున విద్యుత్‌ కోతలు ఎక్కడా విధించడం లేదని వెల్లడించారు.

రాష్ట్రంలో గతంతో పోలిస్తే విద్యుత్‌ సరఫరా పెరిగిందన్నారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడంపై సీఎం రేవంత్‌ ఆరా తీశారు. సదురు అధికారుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరెంట్‌ కట్‌ చేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. దీని వల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారంటూ సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. విద్యుత్‌పై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు కూడా చేస్తున్నారని సీఎం అన్నారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

ఇక ఇదే అంశంపై సీఎం రేవంత్‌కు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రిజ్వీ సమాచారం అందించారు. ఇటీవల రాష్ట్రంలో మూడు సబ్‌స్టేషన్ల పరిధిలో కొద్దిసేపు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిందని అన్నారు. ఇక దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. సబ్‌ స్టేషన్లలో లోడ్‌ హెచ్చుతగ్గులను డీఈలు సరిచూసుకుంటూ ఉండాలని.. అలా చూడకపోవడంతోనే సమస్య తలెత్తిందని అధికారులు సీఎంకు వివరించారు. దాంతో.. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇంకా ఏవైనా మరమ్మత్తులు, ఇతర అంశాల వల్ల సరఫరా నిలిపివేయాల్సి వస్తే ముందుగానే ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలోని వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

Next Story