తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగను ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. హోలీ అనేది కేవలం రంగుల పండుగ మాత్రమే కాదని, అది ప్రేమ, ఆప్యాయతలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో సామరస్యాన్ని పెంచుతుందని, కులమతాలకు అతీతంగా ప్రజల మధ్య సోదరభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తుందని ముఖ్యమంత్రి తన సందేశంలో వివరించారు.
పర్యావరణ హితంగా పండుగను జరుపుకోవాలని సూచిస్తూ.. రసాయన రంగులకు దూరంగా ఉండి, సహజసిద్ధమైన మరియు సురక్షితమైన రంగులను మాత్రమే వాడాలని ఆయన రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే సంప్రదాయబద్ధంగా హోలీని ఆస్వాదించాలని ఆయన కోరారు.