'సాహితీ శిఖరం నేలకూలింది'.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకూలిందన్నారు.
By - అంజి |
'సాహితీ శిఖరం నేలకూలింది'.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
నేలకూలిందన్నారు. రాష్ట్ర సాధనలో అందెశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు. ఆయన రాసిన జయ జయహే తెలంగాణను ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. టీపీసీసీ చీఫ్, మహేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కూడా అందెశ్రీ మరణానికి సంతాపం తెలిపారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ గారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తుచేశారు.
అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.
తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ... ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. అందెశ్రీ గారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో ఇవాళ తెల్లవారుజామున స్పృహా తప్పి పడిపోయారు. దీంతో కుటుంబీకులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన గుండెపోటుతో కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో అందెశ్రీ బాధపడ్డారు.
అందెశ్రీ గురించి
పాత వరంగల్ జిల్లా రేబర్తిలో 1961 జులై 8న పుట్టిన అందె ఎల్లయ్య అనాథగా పెరిగారు. పాఠశాలకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో గొడ్ల కాపరిగా పల్లె, జానపద పాటలతో జీవితం గడిపారు. కూలీ సహా అనేక పనులతో జీవనం గడిపిన ఆయన సమాజ పరిస్థితులనే పాఠాలుగా నేర్చి పాటలుగా మలిచారు. 'మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు' లాంటి మనుషుల్ని, మనసుల్ని మేల్కొలిపే పాటలు రాసిన ప్రజాకవికి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందించింది.