హైదరాబాద్‌లో 250 ఎకరాల్లో మార్కెట్.. 50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ.. 15 వేల కోట్లతో రేడియల్ రోడ్లు: సీఎం రేవంత్
ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా నగరాలు వాయు, భూమి, నీటి కాలుష్యాలతో అతలాకుతలమవుతున్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అలాంటి ప్రమాదాలు హైదరాబాద్‌కు రాకుండా అభివృద్ధికి ఒక క్రమపద్ధతిలో బాటలు వేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
By అంజి Published on 4 Dec 2024 6:57 AM IST
హైదరాబాద్‌లో 250 ఎకరాల్లో మార్కెట్.. 50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ.. 15 వేల కోట్లతో రేడియల్ రోడ్లు: సీఎం రేవంత్
దేశంలో ముఖ్య నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా నగరాలు వాయు, భూమి, నీటి కాలుష్యాలతో అతలాకుతలమవుతున్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అలాంటి ప్రమాదాలు హైదరాబాద్ నగరానికి రాకుండా అభివృద్ధికి ఒక క్రమపద్ధతిలో బాటలు వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాలను హెచ్ఎండీఏ మైదానంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నగరంలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ''దేశంలోని ప్రధాన నగరాలు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను గమనించే మూసీ నదిని ప్రక్షాళన చేయాలని, నదికి పునరుజ్జీవం చేయాలని సంకల్పించాం. వరదలొస్తే నగరంలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచే పరిస్థితి వచ్చింది. అందుకే నగరంలో 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ కడుతున్నాం. భవిష్యత్తరాలకు ఒక అద్భుతమైన హైదరాబాద్ నగరాన్ని అందించాలి. అప్పుడే నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది. ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంగా నిలబడుతుంది'' అని అన్నారు.
''మనం బాగుపడటానికి ఎవరో వస్తారని చూసుకుంటూ కూర్చుంటే ఈ నగరం వరదలతో ముంచెత్తుతుంది. కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుంది. నాలాల ఆక్రమణలను తొలగించాలి. మూసీని ప్రక్షాళన చేయాలి. పారిశ్రామిక కాలుష్యాలు మూసీలో కలవకుండా నియంత్రించాలి. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించుకున్న చోట ఆక్రమణలను తొలగించడానికి హైడ్రా పనిచేస్తుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షించే తెలంగాణకు మణిహారంగా 35 వేల కోట్ల రూపాయలను వెచ్చించి 360 కిలోమీటర్ల పొడవున రీజినల్ రింగ్ రోడ్డును చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించి రీజినల్ రింగ్ రోడ్డును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు మధ్యన రేడియల్ రోడ్లు వేయడానికి 15 వేల కోట్ల రూపాయల వ్యయం చేయగలిగితే తద్వారా 60 శాతం తెలంగాణను అభివృద్ధి బాటన పడుతుంది'' అని సీఎం రేవంత్ అన్నారు.
''ఇబ్రహీంపట్నంలో 250 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో కూరగాయలు, ఫ్రూట్ మార్కెట్, డెయిరీ, పౌల్టీ, మీట్ ప్రాడక్ట్స్ సదుపాయాలు ఉంటాయి. వీటికి అనుబంధంగా కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తాం. ముచ్చర్ల ప్రాంతంలో 40 నుంచి 50 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించాం. 1 ఏప్రిల్ - 30 నవంబర్ 2023 ఆరు నెల్లతో పోల్చితే 1 ఏప్రిల్ - 30 నవంబర్ 2024 కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 29 శాతం పెరిగింది. రాజధాని హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలంటే మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి నుంచి నీటిని తరలింపు, మూసీ ప్రక్షాళన చేయకతప్పదు. ఈ ప్రాజెక్టులన్నింటికీ రాబోయే 4 సంవత్సరాల్లో లక్షన్నర కోట్ల రూపాయలు కావాలి. హైదరాబాద్ నగరమే మన ఆదాయం. ఆత్మగౌరవం. నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం. ఆ ప్రణాళికల ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తాం'' అని సీఎం చెప్పారు.