తెలంగాణలోని అన్ని ప్రధాన జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు, సరకు రవాణాను సులభతరం చేసేందుకు యుద్ధప్రతిపాదికన రింగ్ రోడ్ల నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన రోడ్లు మరియు భవనాల శాఖ సమీక్షా సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారీ వాహనాలు నగరాల్లోకి రాకుండా నిరోధించడంతో పాటు, రవాణా వేగాన్ని పెంచేలా ఈ రోడ్ల రూపకల్పన ఉండాలని స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రాల సమీపంలోని కీలక రహదారులను అనుసంధానిస్తూ రింగ్ రోడ్లు, వాటిని ప్రధాన నగరంతో కలిపేలా రేడియల్ రోడ్లను నిర్మించాలని సూచించారు. వీటిని జాతీయ రహదారులతో అనుసంధానించే అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. అలాగే, హైదరాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే నుండి నాగార్జునసాగర్‌కు కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణ సాధ్యతలను పరిశీలించాలన్నారు.
పెండింగ్‌లో ఉన్న ఆర్‌ఓబీ (ROB), ఆర్‌యూబీ (RUB) పనులను వేగవంతం చేయాలని, అవసరమైన చోట కొత్త వాటికి ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు త్వరితగతిన వైద్య సేవలు అందించేలా బోధనా ఆసుపత్రులు, ఇతర ప్రధాన ఆసుపత్రుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు కె.ఎస్. శ్రీనివాస్ రాజు, వికాస్ రాజ్, మోహన్ నాయక్ పాల్గొన్నారు.