కొత్త సర్పంచ్‌లకు సీఎం రేవంత్ విషెస్..అలా చేయాలని సూచన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా కొలువుదీరిన గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు
By - Knakam Karthik |
కొత్త సర్పంచ్‌లకు సీఎం రేవంత్ విషెస్..అలా చేయాలని సూచన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా కొలువుదీరిన గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం తన ఎక్స్ ఖాతాలో విషెస్ చెప్పారు. "సర్పంచ్‌లుగా, ఉప సర్పంచ్ లుగా, వార్డు మెంబర్లు గా బాధ్యతలు స్వీకరించిన సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు. మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్ది, మీరంతా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను"..అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లుగా, ఉప సర్పంచ్ లుగా, వార్డు మెంబర్లు గా బాధ్యతలు స్వీకరించిన సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు. మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్ది, మీరంతా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను.#LocalGovernance #Telangana… pic.twitter.com/qOVKfkQnpI
— Revanth Reddy (@revanth_anumula) December 23, 2025
కాగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో కొత్త సర్పంచ్‌లు కొలువుదీరారు. సర్పంచ్ లతోపాటు మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. గత రెండేళ్లుగా పంచాయతీల పరిధిలో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఇటీవల మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల మేరకు ఆయా స్థానాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 1,205 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా.. మూడు విడతల్లో 11,497 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా 25,848 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా 85,955 స్థానాలకు ఎన్నికలు చేపట్టారు. దీంతో ఒకరిద్దరు తప్ప.. మొత్తంగా 12,702 మంది సర్పంచ్‌లు, 12,702 మంది ఉపసర్పంచ్‌లు, 1,11,803 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.