అర్హులైన వారికే రైతుభరోసా ఇస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా విత్తనాల కొరత లేదని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
By Srikanth Gundamalla Published on 2 Jun 2024 2:11 AM GMTఅర్హులైన వారికే రైతుభరోసా ఇస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా విత్తనాల కొరత లేదని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. స్టాక్ లేపప్పుడు క్యూలో చెప్పులు పెడితే విత్తనాలు వస్తాయా అని ప్రశ్నించారు. డిమాండ్‌కు అదనంగా 10 శాతం ఎక్కువగానే విత్తనాలను అందుబాటులో ఉంచామని ఆయన అన్నారు. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ కొరత అస్సలు లేదన్నారు. అక్కడక్కడ కరెంట్‌కు అంతరాయం కలుగుతున్నది తప్ప కోతలు కావని ఆయన స్పష్టం చేశారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలాగే సచివాలయం నుంచే బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. తొలుత సీఎం, సీఎస్‌లకు అమలు చేసి ఆ తర్వాత కింది స్థాయి ఉద్యోగులకు అమల్లోకి తెస్తామన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు రావాలని అన్ని పార్టీలకు ఆహ్వానం పంపామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. బీజేపీని కూడా తాము విస్మరించలేదన్నారు. ఇక బీఆర్ఎస్‌పైనా రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. భారత్‌కు స్వాతంత్ర్యం విషయంలో పాకిస్తాన్ ఒకరోజు ముందుగానే వేడుకలు చేసుకున్నట్లు కేసీఆర్ కూడా ఒక రోజు ముందే వేడుకలు చేసుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలు తన నేతృత్వంలో జరగడం జీవితాంతం తనకు గుర్తిండిపోతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా కూడా కేంద్రంలో అధికారంలోకి రాబోయేది ఇండియా కూటమే అని సీఎం రేవంత్‌రెడ్డి దీమాగా చెప్పారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ 9 నుంచి 10 ఎంపీ స్థానాలను గెలవబోతుందని జోస్యం చెప్పారు. ఇక పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో అధిష్టానానిదే ఫైనల్ డెసిషన్ అని చెప్పారు. రైతుభరోసా గురించి కూడా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రైతుభరోసా అమలుపై అసెంబ్లీలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకుంటామని అన్నారు. అర్హులైన వారికి మాత్రమే రైతుభరోసా అందిస్తామని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. కాళేశ్వరం, మేడిగడ్డపై ఎన్డీఎస్‌ఏ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.