సింగిల్ టీచర్ బడులను మూసేయడానికి వీల్లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 5:51 PM ISTసింగిల్ టీచర్ బడులను మూసేయడానికి వీల్లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో.. తెలంగాణలో టెన్త్ పరీక్షల్లో 10/10 జీపీఎస్ సాధించిన విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిభాపురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వందేమాతరం ఫౌండేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని అన్నారు. స్కూళ్లలో టీచర్లు లేరనీ విద్యార్థులు రావడం లేదన్నారు. విద్యార్థులు రావడం లేదన్న నెపంతో సింగిల్ టీచర్ పాఠశాలలను మూసేసే పరిస్థితి కొనసాగిందని రేవంత్ అన్నారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 11వేల పై చిలుకు పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇక రాష్ట్రంలో సింగిల్ టీచర్ బడులను మూసేసే ప్రసక్తే లేదన్నారు. తండాలు, మారుమూల గ్రామాల్లో ప్రభుత్వ బడులను నిర్వహించడం ద్వారా పేదలు, దళితులు, గిరిజనులకు విద్యను అందుబాటులోకి తెచ్చినవాళ్లం అవుతామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ బడుల్లో టాపర్లను ప్రభుత్వమే సత్కరించాలని అన్నారు. మట్టిలో మాణిక్యాలుగా రాణించిన విద్యార్థులు ప్రభుత్వానికే మంచి పేరు తెస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు సర్వీసులో ఉన్న చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు 90 మంది ప్రభుత్వ బడుల్లో చదువుకున్న వారే అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.80వేలు ఖర్చు పెడుతోందని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగించామన్నారు. అలాగే రూ.2వేల కోట్లను శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసేందుకు కేటాయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.