'రుణమాఫీ చేస్తే గులాబీ పార్టీని రద్దు చేసుకుంటారా?'.. హరీశ్‌ రావుకు సీఎం రేవంత్‌ సవాల్‌

ఆగస్టు 15లోగా రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తానని, లేదంటే పదవి నుంచి వైదొలగాలని సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి స్వీకరించారు.

By అంజి  Published on  23 April 2024 2:00 PM GMT
CM Revanth Reddy, Harish Rao, farmer loan waiver, BRS, Congress Govt

'రుణమాఫీ చేస్తే గులాబీ పార్టీని రద్దు చేసుకుంటారా?'.. హరీశ్‌ రావుకు సీఎం రేవంత్‌ సవాల్‌

హైదరాబాద్: ఆగస్టు 15లోగా రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తానని, లేదంటే పదవి నుంచి వైదొలగాలని సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి స్వీకరించారు. ఆగస్టు 15 లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే గులాబీ పార్టీని రద్దు చేసుకుంటారా? అని ప్రశ్‌నించారు. ఈ క్రమంలోనే తన సవాల్‌ను స్వీకరించాలని హరీశ్‌ రావుకు చెప్పారు.

ఏప్రిల్ 23, మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో జరిగిన కొడంగల్ నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపిస్తే తిరిగి ఇటువైపు చూడలేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. సూర్యుడు ఉదయించే దిశను మార్చుకున్నా.. భూమి ఆకాశం తలక్రిందులైనా, కేసీఆర్ ఫాంహౌజ్ లో ఉరి వేసుకొని సచ్చిన రైతులకు పంద్రాగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూసిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రైతులకు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లకు నోటీసులు పంపడంపై సీఎం హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించేది లేదన్నారు. ఈ క్రమంలోనే బ్యాంకు అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15లోగా వడ్డీతో రుణాలను తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. బ్యాంకు అధికారులు రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. రుణాల చెల్లింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

బీజేపీకి చెందిన డీకే అరుణపై సీఎం విరుచుకుపడ్డారు

''అమ్మా తల్లీ.. డీకే అరుణమ్మ.. నేనేదో నిన్ను అవమానించానని అంటున్నావ్.. కానీ నీకు, నాకు మధ్య పోటీ ఏమిటి? గద్వాలలోనే ఓడిపోయిన నీకు, నాకు పోటీయా? బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉండి పాలమూరుకు ఏం చేశావో చెప్పాలి. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మేం చేసుకుందామని అనుకుంటే మోదీ చేతిలో మళ్లీ కత్తివై అడ్డుకునే ప్రయత్నాలు చేయడం ఏమిటి? మోదీ చేతిలో చురకత్తిలా ఎందుకు మారావో చెప్పాలి. నీ మీద నాకు అసూయ, కోపం, ద్వేషం లేవు. అమ్మా తల్లీ.. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని... నాకు ఈ జిల్లాలో శత్రువులెవరూ లేరు" అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

మక్తల్‌-నారాయణపేట-కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆమె నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని అరుణను ఆయన ప్రశ్నించారు. రోడ్ల నిర్మాణం, పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు జాతీయ ప్రాజెక్టు హోదా వచ్చినా.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తమ పార్టీ హైకమాండ్‌ను ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నారని రేవంత్ అరుణను ప్రశ్నించారు.

బీజేపీ పిచ్చి తారాస్థాయికి చేరుకుందని, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని రేవంత్ ఆరోపించారు.

Next Story