విద్యార్థుల‌ను క‌న్న బిడ్డ‌ల్లా చూడాలి : సీఎం రేవంత్‌

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, వ‌స‌తిగృహాలు, గురుకుల పాఠ‌శాల్ల‌లో విద్యార్థుల‌ను క‌న్న బిడ్డ‌ల్లా చూడాల‌ని, వారికి ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అందించ‌డంలో ఎటువంటి అల‌క్ష్యానికి తావు ఇవ్వ‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.

By Kalasani Durgapraveen  Published on  28 Nov 2024 11:15 AM IST
విద్యార్థుల‌ను క‌న్న బిడ్డ‌ల్లా చూడాలి : సీఎం రేవంత్‌

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, వ‌స‌తిగృహాలు, గురుకుల పాఠ‌శాల్ల‌లో విద్యార్థుల‌ను క‌న్న బిడ్డ‌ల్లా చూడాల‌ని, వారికి ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అందించ‌డంలో ఎటువంటి అల‌క్ష్యానికి తావు ఇవ్వ‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. విద్యార్థుల‌కు అందించే ఆహారానికి సంబంధించి చోటుచేసుకుంటున్న ఘ‌ట‌న‌ల‌పై ముఖ్య‌మంత్రి ప‌లుమార్లు స‌మీక్షించారు. క‌లెక్ట‌ర్లు త‌ర‌చూ పాఠశాలల‌, వ‌స‌తిగృహాలు, గురుకుల పాఠ‌శాల‌ల‌ను త‌నిఖీ చేయాల‌ని.. అనంత‌రం అందుకు సంబంధించిన నివేదిక‌ల‌ను సమ‌ర్పించాల‌ని సీఎం క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. ప‌లుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొర‌పాట్లు చోటుచేసుకుంటుండంపై సీఎం ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

విద్యార్థుల‌కు ఆహారం అందించే విష‌యంలో ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీఎం హెచ్చ‌రించారు. విద్యార్థుల‌కు ఆహారం అందించే విష‌యంలో ఎవ‌రైనా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొల‌గించేందుకు వెనుకాడ‌మ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల‌కు మంచి విద్య అందించాల‌నే ఉద్దేశంతో వేల సంఖ్య‌లో ఉపాధ్యాయుల నియామ‌కాలు చేప‌ట్ట‌డంతో పాటు వారికి పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. విద్యార్థుల విష‌యంలో తాము సానుకూల నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ప్ప‌టికీ కొంద‌రు ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌పాలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, అటువంటి శ‌క్తుల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని, బాధ్యులైన వారిని చ‌ట్ట‌ప్ర‌కారం శిక్షిస్తామ‌ని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు. వ‌స‌తిగృహాల్లో ఆహారం విష‌యంలో కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగా పుకార్లు సృష్టించ‌డంతో పాటు లేని వార్త‌లను ప్ర‌చారం చేస్తూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్నార‌ని.. వారిపైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

Next Story