Telangana: 'ప్రజా పాలన' దరఖాస్తులను విడుదల చేసిన సీఎం

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఐదు పథకాలకు సంబంధించిన దరఖాస్తు పత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.

By అంజి
Published on : 27 Dec 2023 1:49 PM IST

CM Revanth Reddy, PrajaPalana applications, Telangana

Telangana: 'ప్రజా పాలన' దరఖాస్తులను విడుదల చేసిన సీఎం

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఐదు పథకాలకు సంబంధించిన దరఖాస్తు పత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ప్రజాపాలన లోగోతో పాటు దరఖాస్తు పత్రాన్ని ఆవిష్కరించారు. 'ప్రజా పాలన' పేరుతో ఈ దరఖాస్తు పత్రం ఉంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రజా పాలనలో ఈ పత్రంతోనే ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

రేపటి నుంచి ఐదు పథకాల దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సీఎం తెలిపారు. రేపటి నుంచి గ్రామ, వార్డు సభలు ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాకుండా పేదవారికి సాయం అందించడమే తమ పార్టీ లక్ష్యమని రేవంత్‌ తెలిపారు. రేపటి నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారంటీల లబ్ధి పొందేందుకు అప్లికేషన్‌ ఫాంలో వివరాలు నింపి గ్రామ సభలో సమర్పించాల్సి ఉంటుంది.

అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. వారంలో రెండు రోజుల పాటు ప్రజావాణి కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజా వాణిలో ఇప్పటి వరకు 24 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. భూములు, ఇళ్లు లేని వారు, ఆరోగ్యశ్రీ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని సీఎం తెలిపారు. ఫిర్యాదులను అధికారులకు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి మండలానికి తహశీల్దార్‌ బాధ్యత వహిస్తారని, ప్రతి అధికారి రోజూ రెండు గ్రామాలను సందర్శిస్తారని సీఎం తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందన్నారు.

Next Story