ఓఆర్ఆర్ టెండర్ల‌పై సిట్ విచారణకు సీఎం ఆదేశం

ఓఆర్‌ఆర్ టెండర్ల‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్ విచారణకు ఆదేశించారు.

By Medi Samrat  Published on  19 Dec 2024 7:49 PM IST
ఓఆర్ఆర్ టెండర్ల‌పై సిట్ విచారణకు సీఎం ఆదేశం

ఓఆర్‌ఆర్ టెండర్ల‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్ విచారణకు ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి జైకా నుంచి నిధులు తెచ్చి ఓఆర్ఆర్ నిర్మించారు. దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పన్నంగా టెండర్‌కు అప్పగించిందని ధ్వజమెత్తారు. ఎయిర్‌పోర్టు, ఓఆర్ఆర్, ఐటీ కంపెనీలను తీసుకొచ్చి హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేసింది కాంగ్రెస్‌ అన్నారు. క్రిడెట్ అంతా కాంగ్రెస్‌కే దక్కుతుందని తెలిపారు. అంతేకాకుండా ప్రజల అవసరాలు తీర్చాలని కృష్ణ, గోదావరి నీళ్లు తేవడానికి పీజేఆర్ ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్సే అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారడానికి కాంగ్రెస్ కారణమని వివరించారు.

వేల కోట్ల ఓఆర్ఆర్ ఆస్తిని అప్పన్నంగా అమ్ముకున్నారని బీఆర్‌ఎస్‌పై రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు ఓడించబోతున్నారని తెలిసి.. అమ్మేసుకున్నారని ఆరోపించారు. దేశం విడిచిపెట్టి పోవాలనే ఉద్దేశంతోనే ఓఆర్ఆర్ ఆస్తులను గత ప్రభుత్వాధినేతలు అమ్మేసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హరీశ్‌రావు విచారణ కోరారు.. ఆయన కోరిక మేరకు సిట్ విచారణకు ఆదేశిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విధివిధానాలు కేబినెట్‌లో చర్చించి విచారణ చేయిస్తామన్నారు.

సీఎం వ్యాఖ్య‌ల‌పై హరీష్ రావు స్పందిస్తూ.. ఓఆర్ఆర్ టెండర్లపై విచారణకు ఆదేశించడంపై తమకు అభ్యంతరం లేదని, ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని కోరారు.

Next Story