ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం శామీర్‌పేట్ జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ కొత్త యూనిట్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే 33 శాతం వ్యాక్సిన్స్ , బల్క్ డ్రగ్స్ లో 43 శాతం ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. కోవిడ్ సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ను ఎగుమతి చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలది. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయి..అని సీఎం పేర్కొన్నారు.
మా ప్రభుత్వం మరింత సరళమైన విధానాలతో ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ డేటా సిటీగా మారనుంది. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 లక్షల 28 వేల కోట్లు పెట్టుబడులు సాధించాం. ప్రపంచ దేశాలతో పోటీ పడాలని, అధునాతన విధానాలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. రాబోయే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఇందుకు జీనోమ్ వ్యాలీ పారిశ్రామికవేత్తల సహకారం ఉండాలని కోరుతున్నా..అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.