హైదరాబాద్ పరిధిలో వరల్డ్ క్లాస్ ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

By Knakam Karthik  Published on  28 Jan 2025 2:39 PM IST
Telangana, Hyderabad, Cm Revanth inaugurated the World Class Experience Park

హైదరాబాద్ పరిధిలో వరల్డ్ క్లాస్ ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును రాందేవ్ రావు ఏర్పాటు చేశారు. ఇందులో 25 వేల జాతుల మొక్కలు ఉన్నాయి. 85 దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి. ఎక్స్ పీరియం పార్కులో రూ.లక్ష నుంచి రూ.3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పలు వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు.

కాగా ఈ పార్క్‌ను రాందేవ్ రావు ఆరున్నర సంవత్సరాల పాటు శ్రమించి తీర్చిదిద్దారు. దీనిలో వివిధ ఆకృతుల్లో రాక్ గార్డెన్‌ను సిద్ధం చేశారు. 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. రూ.150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిగిన ఏకైక టూరిస్టు ప్లేస్‌గా ఈ ఎక్స్ పీరియం పార్క్ నిలిచింది.

ఎక్స్ పీరియం పార్క్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల సందర్శనకు మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. మందిరాల దర్శనాల కోసం తమిళనాడు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నామని, అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణలో మాత్రం గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని చెప్పారు. ఎకో టూరిజంపై ఇటీవలే అసెంబ్లీలో చర్చించామన్న ఆయన పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు.

Next Story