భారీ వర్ష సూచన.. మరింత అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్‌

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

By అంజి
Published on : 16 Aug 2025 1:36 PM IST

CM Revanth, officers, staff, high alert ,heavy rains, Telangana

భారీ వర్ష సూచన.. మరింత అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్‌

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, జ‌య‌శంక‌ర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి ఉదయం ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడారు.

వాతావ‌ర‌ణ శాఖ అందంచిన స‌మాచారం మేరకు, 15 జిల్లాల్లో అధిక వ‌ర్ష‌పాతం, మిగ‌తా జిల్లాల్లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని తెలిపారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ముందుగానే మొహరించారని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. తాజా పరిస్థితులపై అధికారులతో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

''వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉంటూ, లోత‌ట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలి. నీటి పారుద‌ల శాఖ అధికారులు, సిబ్బంది రిజ‌ర్వాయ‌ర్లు, చెరువులు, కుంట‌ల నీటి మ‌ట్టాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తూ నీటి విడుద‌ల‌పై ముందుగానే క‌లెక్ట‌ర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి స‌మాచారం ఇవ్వాల‌. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలి.

రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవ‌ల్ బ్రిడ్జిలు, కాజ్‌వేల‌పై నుంచి రాక‌పోక‌లు పూర్తిగా నిషేధించాలి. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి స‌మీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ప‌ర్య‌వేక్ష‌ణ చేయాలి. వ‌ర్ష‌పు నీరు నిల్వ ఉండి దోమ‌లు, ఇత‌ర క్రిమికీట‌కాలు విజృంభించి అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉన్నందున న‌గ‌ర‌, పుర‌పాల‌క‌, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్టాలి. వైద్యారోగ్య శాఖ త‌గినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలి. అవ‌స‌ర‌మైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి.

ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప‌శు న‌ష్టం చోటుచేసుకోకుండా జాగ్ర‌త్త‌లు వ‌హించాలి. రెవెన్యూ, విద్యుత్‌, పంచాయ‌తీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య‌, పుర‌పాల‌క‌, పోలీస్‌, అగ్నిమాప‌క శాఖ‌లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స‌మ‌న్వ‌యంతో పనిచేయాలి. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల‌కు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క శాఖ సిబ్బంది త‌క్ష‌ణ‌మే స్పందించాలి'' అని సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు.

Next Story