హైదరాబాద్ రోడ్లు, ఫ్లై ఓవర్ల కోసం.. 2,450 ఎకరాల రక్షణ శాఖ భూమిని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్

2,500 ఎకరాల రక్షణ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.

By అంజి  Published on  24 Jun 2024 3:48 PM GMT
CM Revanth, Central Govt, Defense Department land, Hyderabad

హైదరాబాద్ రోడ్లు, ఫ్లై ఓవర్ల కోసం.. 2,450 ఎకరాల రక్షణ శాఖ భూమిని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్

న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరంలో రోడ్ల విస్తరణ, ఇతర పౌర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 2,500 ఎకరాల రక్షణ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు.

పరస్పరం భూముల బదలాయింపులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి

రావిరాల గ్రామంలో ఇమారత్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఆర్‌సీఐ) కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 2,462 ఎకరాల భూమిని వినియోగిస్తున్న విషయాన్ని రక్షణ మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఆర్‌సీఐ కోసం రక్షణ విభాగం ప్రభుత్వ భూములను వినియోగిస్తున్నందున, హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం 2,450 ఎకరాల భూమిని బదలాయించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ శాఖ మధ్య పరస్పరం భూముల బదలాయింపునకు అంగీకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి రక్షణ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

వరంగల్ సైనిక్ స్కూల్‌కు తాజాగా అనుమతి

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వరంగల్‌కు సైనిక్ స్కూల్‌ను మంజూరు చేసిందని రక్షణ మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. అయితే గత రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వరంగల్ సైనిక్ స్కూల్‌కు గతంలో ఇచ్చిన అనుమతి గడువు ముగిసిందని, తాజాగా అనుమతిని పునరుద్ధరించాలని లేదా మంజూరు చేయాలని రక్షణ మంత్రిని సీఎం అభ్యర్థించారు.

నాగర్‌కర్నూల్, ఖమ్మం, జహీరాబాద్, భువనగిరి, నల్గొండ, పెద్దపల్లి ఎంపీలు - మల్లు రవి, ఆర్ రఘురాంరెడ్డి, బలరాంనాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కె రఘువీరారెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్యేక కార్యదర్శి బి అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.

Next Story