తెలంగాణలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రచారానికి నాయకత్వం వహించనున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్ రానున్నారు. సీఎం రేవంత్ రాష్ట్రానికి రాగానే ఫిబ్రవరి 2న కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు, మంత్రులకు అప్పగించే భాద్యతలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై విస్తృత చర్చ జరపనున్నారు.
సింగరేణి టెండర్ల వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం వంటి అంశాలపై సుదీర్ఘ మంతనాలు జరుపుతారని మీడియా వర్గాల సమాచారం. అటు.. ఫిబ్రవరి 3 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఫిబ్రవరి 3న మిర్యాలగూడ, 4న జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార సభలు జరగనున్నాయి.