హైదరాబాద్: రేషన్ కార్డులు లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబరు 2 వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సీఎం సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వడానికి సంబంధించి కసరత్తు చేశారు. ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని మంత్రులను సీఎం రేవంత్ ఆదేశించారు. కాగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయిన విషయం తెలిసిందే.