తక్కువ ధరకే ఇసుక.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఉన్నతస్థాయి అధ్యయన కమిటీని నియమించారు.
By అంజి Published on 29 Jan 2025 6:52 AM IST
తక్కువ ధరకే ఇసుక.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఉన్నతస్థాయి అధ్యయన కమిటీని నియమించారు. ఈ కమిటీ వారం రోజుల్లోగా తమ అధ్యయనాన్ని పూర్తి చేసి సమగ్ర విధివిధానాలతో నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్‌లతో కమిటీని నియమించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా.. గనుల శాఖపై ముఖ్యమంత్రి సచివాలయంలో మంత్రి పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ సీఎస్ శాంతి కుమారితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు.
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం ప్రారంభించనున్న నేపథ్యంలో లబ్ధిదారులకు సౌకర్యంగా ఇసుక విధానం ఉండాలన్నారు. రాష్ట్రంలో ఏటేటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆదాయం ఆశించినంత రావడం లేదని, అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోందని అన్నారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలని.. అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మేజర్, మైనర్ ఖనిజాల గనులకు వేసిన జరిమానాలు వసూళ్లు కాకపోవడంపైనా అధికారులను సీఎం ప్రశ్నించారు. మేజర్, మైనర్ ఖనిజ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని అధ్యయన కమిటీని సీఎం ఆదేశించారు.