Telangana: నిరుద్యోగులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
గ్రూప్ - 2 సహా మరికొన్ని పోటీ పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు.
By అంజి Published on 14 July 2024 4:07 PM ISTTelangana: నిరుద్యోగులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
హైదరాబాద్: గ్రూప్ - 2 సహా మరికొన్ని పోటీ పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. కొందరు నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయమంటున్నారని, మరికొందరు వద్దంటున్నారని, వారి సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ తెలిపారు. ఏదైనా ఇబ్బంది ఉంటే మంత్రులను కలవాలని సూచించారు. తప్పకుండా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని కాటమయ్య కిట్ల పంపిణీ సభలో సీఎం హామీ ఇచ్చారు.
''నిరుద్యోగులకు ఏమైనా సమస్యలు వుంటే మంత్రులను కలవండి. నిన్న, మొన్న కొందరు పిల్లలు పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారు పిల్లలు రోడ్డు ఎక్కడం కన్నా ప్రభుత్వం వారి సమస్యలు వినడానికి సిద్ధంగా ఉంది'' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఇంకా సీఎం మాట్లాడుతూ.. పేదలకు కార్పొరేట్ విద్య, వైద్యం అందించాలని ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీపథకాలను కాంగ్రెస్ తెచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్ నిర్మాణాల వల్ల రంగారెడ్డి జిల్లా భూముల విలువ పెరిగిందన్నారు. త్వరలోనే హయత్‌నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు. అంతకుముందు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలోని స్థానిక తాటి వనంలో సీఎం రేవంత్.. ఈత మొక్కలను నాటారు. అనంతరం గౌడన్నల రక్షణ కోసం రూపొందించిన కాటమయ్య కిట్‌లను పంపిణీ చేశారు.