పేలుడు ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటన

మృతుల కుటుంబాలకు తక్షణ సాయాన్ని సీఎం ప్రకటించారు.

By Knakam Karthik
Published on : 1 July 2025 12:27 PM IST

Hyderabad, Patancheru, SigachiPharmaBlast, CM RevanthReddy

పేలుడు ఘటన: మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటన

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన పేలుడు ఘటనలో 40 మందికి మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి కారణాలు, సహాయక చర్యల్లో పురోగతిపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రసాయన కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించాలని సీఎం సూచనలు చేశారు. కంపెనీలలో లోపాలను గుర్తించి డీటెయిల్డ్ రిపోర్టు రూపొందించాలని ఆదేశించారు. సహాయక చర్యలకు సంబంధించి విభాగాల మధ్య సమన్వయం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఇక మృతుల కుటుంబాలకు తక్షణ సాయాన్ని సీఎం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష, గాయపడిన వారికి రూ.50 వేలు తక్షణ సాయంగా అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇది నష్టపరిహారం కాదని, కేవలం తక్షణ సాయం మాత్రమే అని అధికారులకు స్పష్టం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రీట్‌మెంట్‌ అందించేందుకు ఖర్చుకు వెనకాడవద్దని, అవసరమైతే ప్రభుత్వమే వారి ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చు భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు.

కాగా పాశమైలారం ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత దురదృష్టకరమైన ఘటన అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇన్ని ప్రాణాలకు బలిగొన్న దుర్ఘటన రాష్ట్రంలో జరగలేదు. 143 మంది ఉన్నారు, 58 మందిని అధికారులు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించా. తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించా. ఘటనపై బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తాం...అని సీఎం పేర్కొన్నారు.

Next Story