తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించతలపెట్టిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్'కు హాజరు కావాలని ప్రధానిని వారు సాదరంగా ఆహ్వానించారు.
అంతకుముందు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తోనూ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా మరికొందరు కేంద్ర మంత్రులను, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలిసి సదస్సుకు ఆహ్వానించనున్నారు.
కాగా, మంగళవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలిసిన రేవంత్ రెడ్డి, గ్లోబల్ సమిట్‌కు తప్పకుండా హాజరు కావాలని కోరారు. తెలంగాణ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటేలా ఈ సదస్సును విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.