రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్.. అక్టోబర్ 1న వరంగల్ పర్యటన
CM KCR's visit to Yadadri tomorrow.. these are the full details. తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు యాదాద్రి వెళ్లనున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ‘విమాన గోపురం’ బంగారు
By అంజి Published on 29 Sep 2022 2:29 PM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ రేపు యాదాద్రి వెళ్లనున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ 'విమాన గోపురం' బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. సీఎం ఉదయం 11.30 గంటలకు రోడ్డు మార్గంలో యాదాద్రికి చేరుకుని ఆలయంలో పూజల్లో పాల్గొంటారు. తన కుటుంబం తరపున 'విమాన గోపురం' బంగారు తాపడం కోసం ఒక కిలో 16 తులాల బంగారాన్ని సమర్పిస్తారు. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపైగల మందిరంలోని ప్రస్తుత బాలాలయం ఆవరణలో 'కళా వేదిక'కి సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
సీఎం పర్యటనకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు.. ఆయన చివరిసారిగా ఏప్రిల్‌లో యాదాద్రికి వచ్చి అక్కడ శివాలయం పునఃప్రారంభంలో పాల్గొన్నారని తెలిపారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 1 వ తేదీన వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వరంగల్‌లో ప్రతిమ ఆస్పత్రిని సీఎం ప్రారంభింస్తారు. అనంతరం హన్మకొండ, వరంగల్ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. అక్టోబర్ 2న సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఆస్పత్రిలో ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
దసరా పండుగ రోజున ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన జాతీయ పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఆ రోజున టీఆర్‌ఎస్‌ఎల్పీ, పార్టీ సమావేశాలను నిర్వహించనున్న కేసీఆర్, ప్రజాప్రతినిధుల అంగీకారంతో మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీని, దాని పేరును ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి కేంద్రంలో పాలన సాగిస్తామని, తాము అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్ పలుమార్లు సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపారు. ఆయన ఇటీవల సెప్టెంబర్ 16న గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలాతో సమావేశమై జాతీయ పార్టీ ఏర్పాటుపై మాట్లాడారు. మరోవైపు, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు.