ఎన్నికల ముందు.. సీఎం కేసీఆర్ రూ.5 వేల కోట్ల నిధుల విడుదల!

తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రాకముందే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేయనున్నట్టు సమాచారం.

By అంజి  Published on  26 Sep 2023 1:08 AM GMT
CM KCR, special funds , elections,Telangana

ఎన్నికల ముందు.. సీఎం కేసీఆర్ రూ.5 వేల కోట్ల నిధుల విడుదల!

హైదరాబాద్‌ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం రెండు వారాల్లోగా ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.5,000 కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎంవో అధికారిక వర్గాలు తెలిపాయి.

భారత ఎన్నికల సంఘం అక్టోబర్ 6న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిధుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎమ్మెల్యేలు, వారి నియోజకవర్గ అభివృద్ధి నిధి (CDF) అయిపోయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 10,000 కోట్లు కేటాయించడంతో ఎస్‌డీఎఫ్‌ కింద నిధులు కోరుతున్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంపీ నిధుల (పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం)తో సమానంగా, 2021-22 నుండి ఎమ్మెల్యేలకు సీడీఎఫ్‌ని రూ. 3 కోట్ల నుండి రూ. 5 కోట్లకు పెంచింది.

2019-20లో ఆర్థిక మందగమనం, 2020-21, 2021-22లో కోవిడ్ -19 మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినందున ఎమ్మెల్యేలకు సిడిఎఫ్ నిధులు అందలేదు. దీంతో ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయారు.

'మన ఊరు-మన బడి' కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఎమ్మెల్యేలకు పేపర్‌పై రూ.5 కోట్లు వచ్చినా కేవలం రూ.2 కోట్లు మాత్రమే మిగిలాయి. ప్రభుత్వం నేరుగా సీడీఎఫ్ నిధుల నుంచి రూ.3 కోట్లు మినహాయించగా, ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నట్లు సమాచారం.

దీంతో గతంలో ప్రారంభించిన పలు పనులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పెండింగ్‌లో ఉండడంతో ఎమ్మెల్యేలు నిధుల కొరతతో సతమతమవుతున్నారు. అసెంబ్లి నియోజకవర్గాల్లోని చాలా గ్రామాలు, పట్టణాలు అధ్వాన్నమైన రోడ్లు, సరిపడని డ్రైనేజీ వ్యవస్థల వంటి మౌలిక సదుపాయాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి, దీని కారణంగా పరిస్థితులను మెరుగుపరచాలని స్థానికుల నుండి బలమైన డిమాండ్ ఉంది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అలాగే ఓటర్ల తాజా డిమాండ్లను నెరవేర్చాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారు.

Next Story