సీఎం కేసీఆర్ నేడు వరంగల్, యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైద్రాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.30 గంటలకు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి సీఎం చేరుకుంటారు. అక్కడ ముందుగా సెంట్రల్ జైలు ప్రాంతంలో పర్యటిస్తారు. నూతనంగా 30 అంతస్థుల్లో నిర్మించే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆపై 11.35 గంటలకు కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన కాళోజీ హెల్త్ వర్సిటీ భవనాన్ని ప్రారంభిస్తారు. తర్వాత హన్మకొండ సుబేదారి ప్రాంతంలో నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనాన్నీ ప్రారంభిస్తారు. తర్వాత మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తారు.
అనంతరం యాదాద్రికి పయనమవుతారు. అక్కడ ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. శివాలయం, రథశాల, విష్ణుపుష్కరిణి, పెద్దగుట్టపై టెంపుల్‌సిటీ లేఅవుట్, గండిచెరువు వద్ద నిర్మాణాలు, ప్రెసిడెన్షియల్ సూట్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు చేరుకుంటారు. సీఎం పర్యటన సందర్భంగా రెండు జిల్లాల అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.