రేపు సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన
CM KCR Visits Karimnagar Tomorrow. తెలంగాణ సీఎం కేసీఆర్ మరికాసేపట్లో వరంగల్ జిల్లాకు వెళ్లనున్నారు. కరీంనగర్ మాజీ
By Medi Samrat
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో వరంగల్ జిల్లాకు వెళ్లనున్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయిన్ పల్లి వినోద్ కుమార్ కుమారుడి వివాహం నేపథ్యంలో వరంగల్ వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. ఈ వివాహానికి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం హాజరు కానున్నారు. వివాహం అనంతరం అక్కడి నుంచి రాత్రి 7 గంటల ప్రాంతంలో కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు. ఇంకా ఇవాళ రాత్రి కరీంనగర్ జిల్లాలోనే బస చేయనున్నారు సీఎం కేసీఆర్.
అలాగే.. రేపు ఉదయం కార్మిక విభాగం నాయకుడు ఎల్. రూప్ సింగ్ కూతురి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. అనంతరం దళితబంధు నిధుల వినియోగంపై సమీక్ష జరపనున్నారు. దళిత బంధు పథకం అమలు, హుజురాబాద్ ఉప ఎన్నికపై ఈ సమీక్ష లో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలావుంటే.. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం గురువారం ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్‌లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఈ నిధులను బదిలీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ. 1,500 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లతో కలిపి మొత్తం రూ.2 వేల కోట్లు రిలీజ్ అయ్యాయి.