సాగర్‌పై సీఎం కేసీఆర్ వరాలే.. వరాలు
CM KCR Visit Nagarjunasagar. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జునసాగర్ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు.
By Medi Samrat Published on 2 Aug 2021 9:00 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జునసాగర్ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. కృష్ణా జలాలపై రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో తెరాసను గెలిపించినందుకు ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తనకు కరోనా సోకడంతో నియోజకవర్గానికి రావడం ఆలస్యమైందన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. హాలియా, నందికొండ అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. హాలియాలో డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం నిర్మిస్తామన్నారు. నల్గొండ జిల్లాలో 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీటన్నింటినీ ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. సాగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బంజారాలు ఉన్నారు. వారి కోసం బంజారా భవనం నిర్మిస్తామన్నారు. రెండేళ్లలో విద్యుత్ వ్యవస్థను తీర్చిదిద్ది రైతాంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇస్తామని చెబితే ఆనాడు జానారెడ్డి ఎగతాళి చేశారని.. ఇప్పుడు చేసి చూపించామన్నారు. దళితబంధు కోసం రూ.లక్ష కోట్లయినా ఖర్చు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 17లక్షల మంది దళితులు ఉన్నారు. వీరిలో దాదాపు 12 లక్షల మంది దళితబంధుకు అర్హులని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి బ్యాంకుతో సంబంధం లేకుండా దళితబంధు కింద రూ.10లక్షలు వేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 కుటుంబాలకు వచ్చేలా చర్యలు చేపడతామని.. ఆరునూరైనా దళితబంధును అమలు చేసి చూపిస్తామన్నారు.
Next Story