రోశయ్య భౌతిక కాయానికి సీఎం కేసీఆర్, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నివాళి
CM KCR Tribute to Former AP CM Rosaiah.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు పూర్వ గవర్నర్
By తోట వంశీ కుమార్ Published on 4 Dec 2021 8:56 AM GMTఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు పూర్వ గవర్నర్ కొణిజేటి రోశయ్య పార్థివదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి వెళ్లిన సీఎం.. రోశయ్య పార్థివ దేహాం వద్ద పుష్పగుచ్చిం ఉంచి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆదివారం మధ్యాహ్నాం ఒంటి గంటకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం వరకు రోశయ్య భౌతికకాయం అమీర్‌పేటలోని ఆయన నివాసంలో ఉండనుంది. అనంతరం గాంధీభవన్‌కు భౌతికకాయం తరలిస్తారు. ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు. మధ్యాహ్నాం 12.30గంటలకు గాంధీ భవన్ నుంచి అంతిమయాత్ర సాగనుంది.
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కూడా రోశయ్య భౌతిక కాయానికి నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు రోశయ్య మరణం తీరని ఆవేదన కలిగిస్తోందన్నారు. కార్యకర్త స్థాయి నుంచి సీఎం, గవర్నర్ స్థాయి వరకూ ఆయన చేరారన్నారు. తెలుగువారందరికీ రోశయ్య గుర్తింపు తెచ్చారన్నారు. అర్థశతాబ్దానికిపైగా ప్రజలకు సేవలు అందించారన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ పాలనాధ్యక్షుడిగా పేరుపొందారని తెలిపారు. విలువలకు, సంప్రదాయాలకు రోశయ్య మారు పేరు అని ఎన్వీ రమణ అన్నారు.
రోశయ్య మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది.