సినారెకు సీఎం కేసీఆర్ ఘన నివాళి
CM KCR Tribute To C Narayana Reddy. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు.
By Medi Samrat Published on
12 Jun 2021 11:51 AM GMT

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాహితీ సౌరభాలను 'విశ్వంభర'తో విశ్వవ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపారని సీఎం కేసీఆర్ అన్నారు. కవిగా, రచయితగా, గేయ కావ్య కృతి కర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీతాల రచయితగా, తనదైన శైలిలో తెలంగాణ పద సోయగాలను ఒలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించిన సృజనకారుడు సినారె అని సీఎం అన్నారు.
దక్కనీ ఉర్దూ, తెలుగు భాషా సాహిత్యాలను జుగల్బందీ చేసి, గజల్స్ తో అలాయ్ బలాయ్ తీసుకొని, తెలంగాణ గడ్డమీద గంగా జమునా తెహజీబ్ కు సినారె సాహితీ చిరునామాగా నిలిచారని సీఎం గుర్తుచేసుకున్నారు. దేశీయ, అంతర్జాతీయ భాషల్లో, తెలుగు సాహితీ లోకంలో, తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానాన్ని చేకూర్చిన సినారె కృషి అజరామరం అని సీఎం కొనియాడారు. భాష, సాహిత్యం నిలిచివున్నన్నాళ్ళూ ప్రజల హృదయాల్లో సినారె నిలిచివుంటారని సీఎం స్మరించుకున్నారు.
Next Story