రైతుల నుండి బియ్యం కొనుగోలుకు సంబంధించిన వివాదంపై సోమవారం ఢిల్లీలో నిరసన దీక్షను ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. "మోదీకి దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేయనివ్వండి... దయచేసి మా ఆహార ధాన్యాలు కొనండి. నేను మీకు 24 గంటల సమయం ఇస్తున్నాను, ఆ తర్వాత మేము మా నిర్ణయం తీసుకుంటాము." అని అన్నారు. "తెలంగాణ వారి హక్కును డిమాండ్ చేస్తోంది. కొత్త వ్యవసాయ విధానాన్ని రూపొందించమని నేను ప్రధానమంత్రికి చెప్పాలనుకుంటున్నాను'' అని కేసీఆర్ అన్నారు.
ప్రభుత్వాలను పడగొట్టే శక్తి ఉన్న రైతుల మనోభావాలతో ఆడుకోవద్దని, రైతులు బిచ్చగాళ్లేమీ కాదని అన్నారు. కేంద్ర సర్కారుపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, అన్నదాతలు సిద్ధంగా ఉన్నారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయించే అంశం, ధాన్యం నిల్వలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.