కామారెడ్డి పల్లెల రూపు రేఖలు మారుస్తా: సీఎం కేసీఆర్

కామారెడ్డి నుంచి పోటీ చేయాలని ఇక్కడి నాయకులు తనను కోరారని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  9 Nov 2023 11:33 AM GMT
cm kcr, telangana, elections,  brs meeting, kamareddy,

కామారెడ్డి పల్లెల రూపు రేఖలు మారుస్తా: సీఎం కేసీఆర్

తెలంగాణ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గురువారం పెద్దత ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళే బీర్ఎస్‌లోని ముఖ్య నాయకులంతా నామినేషన్లు వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం సీఎం కేసీఆర్ గజ్వేల్‌, కామారెడ్డి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కామారెడ్డిలో బీఆర్ఎస్‌ నాయకులు ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

కామారెడ్డి నుంచి పోటీ చేయాలని ఇక్కడి నాయకులు తనను కోరారని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. కామారెడ్డి పల్లెల రూపురేఖలు మార్చే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కామారెడ్డిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చామని సీఎం అన్నారు. కేసీఆర్ వెంట కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డితో తనకు చిన్నప్పటి నుంచే అనుబంధం వుందని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.

బీడీ కార్మికులందరికీ పెన్షన్ పెంచుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా 24 గంటలపాటు కరెంటు ఇవ్వడం లేదన్నారు. గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంటు లేదన్నారు. రైతుబంధు దుబారా అంటూ కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. రైతుబంధు ఉండాలంటే కాంగ్రెస్‌ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఒక్క నవోదయ స్కూల్‌ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓట కూడా వేయొద్దన్నారు. ఎప్పుడూ వ్యవసాయం చేయని రాహుల్ గాంధీ.. ధరణి తీసేస్తామంటున్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ కామారెడ్డి అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి బరిలోకి దిగుతున్నాడని.. రూ.50 లక్షలతో దొరికిన వ్యక్తి అంటూ గుర్తు చేశారు. అన్నీ ఆలోచించి కామారెడ్డి ప్రజలు తీర్పు చెప్పాలన్నారు. తెలంగాణలో రాజకీయ అస్థిరత తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన హెచ్చరించారు. తెలంగాణను బతకనీయొద్దని చూశారని.. కామారెడ్డి ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

Next Story