కేంద్రంపై యుద్దానికి శ్రీకారం.. అంతం కాదు ఆరంభం : సీఎం కేసీఆర్‌

CM KCR speech in TRS Mahadharna.వ‌రిధాన్యం కొనుగోళ్ల విష‌యంలో కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ హైద‌రాబాద్‌లోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Nov 2021 12:27 PM IST
కేంద్రంపై యుద్దానికి శ్రీకారం.. అంతం కాదు ఆరంభం : సీఎం కేసీఆర్‌

వ‌రిధాన్యం కొనుగోళ్ల విష‌యంలో కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ హైద‌రాబాద్‌లోని ఇందిరా పార్క్ వ‌ద్ద టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో గురువారం మ‌హాధ‌ర్నా కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ ధ‌ర్నాలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స‌హా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై యుద్దానికి శ్రీకారం చుట్టామ‌న్నారు. ఇది అంతం కాద‌ని.. ఆరంభం మాత్ర‌మేన‌ని.. ఇంకా ఉద్దృతం చేస్తామ‌న్నారు.

ధ‌ర్మంగా, న్యాయంగా వ్య‌వ‌సాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింద‌న్నారు. కేంద్రం విధానాల వ‌ల్ల రైతాంగం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌న్నారు. రైతు నిరంకుశ చ‌ట్టాల‌ను విర‌మించుకోవాల‌ని, క‌రెంటు బ‌కాయిల మీట‌ర్లు పెట్టే విధానాన్ని మార్చుకోవాల‌ని అనేకసార్లు కేంద్రానికి విన్న‌వించినా.. స్పంద‌న లేద‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే కేంద్రంపై యుద్దానికి శ్రీకారం చుట్టామ‌న్నారు. మ‌న హ‌క్కులు సాధించే వ‌ర‌కు, రైతుల ప్ర‌యోజ‌నాలు ప‌రిర‌క్షించ‌బ‌డే వ‌ర‌కు, ఉత్త‌ర భార‌త‌దేశంలోని రైతులను క‌లుపుకుని కేంద్రంపై పోరాడ‌తామ‌న్నారు.

పంజాబ్ రాష్ట్రంలో కొన్నట్లు ఇక్కడ కూడా వరి ధాన్యం కొనాలని స్వయంగా కోరానని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రధాని మోడీకి లేఖ రాసినా.. ఉలుకు లేదు పలుకు లేదని మండిప‌డ్డారు. మ‌న బాధ‌ను దేశానికి, ప్రపంచానికి తెలియ‌జేసేందుకే ఈ ధ‌ర్నాకు శ్రీకారం చుట్టామ‌ని వివ‌రించారు. తెలంగాణ‌లోని గ్రామాల్లో కూడా ధ‌ర్నాలు చేయాల‌ని పిలుపునిచ్చారు. కేంద్రం దిగి వ‌చ్చి న్యాయం చేసే వ‌ర‌కు పోరాటం కొన‌సాగుతూనే ఉంటుంద‌న్నారు. మ‌హాధ‌ర్నాలో నీతి, నిజాయతీ ఉన్నాయ‌నీ.. అందుక‌నే చిరుజ‌ల్లులు కూడా స్వాగ‌తం ప‌లికాయ‌ని సీఎం కేసీఆర్ అన్నారు.

Next Story