ఆలోచన చెయ్యండి.. ఆగమాగం ఓటేస్తే మోసపోతారు : సీఎం కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
By Medi Samrat Published on 27 Nov 2023 4:12 PM ISTఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుందని.. కాంగ్రెస్ హయాంలో రైతులు కరెంటు బిల్లు కట్టలేకపోతే తలుపులు పీక్కపొయేటోళ్లని వివరించారు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు పాలన చేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్లుగా అధికారంలో ఉంది. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది..? బీఆర్‌ఎస్ పాలనలో ఏం జరిగింది.? అనేది బేరీజు వేసుకుని ఓటేయాలని సీఎం ప్రజలను కోరారు.
ఆలోచన లేకుండా ఆగమాగం ఓటేస్తే మోసపోతారని హెచ్చరించారు. అభ్యర్థి గుణగణాలను, అ అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ నడవడిక, చరిత్రను బేరీజు వేసుకుని వేటు వేస్తే మంచి జరుగుతుందని సూచించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ రూ.200 పెన్షన్ ఇచ్చేది. మేం అధికారంలో వచ్చినంక దాన్ని రూ.1000 చేసినం. తర్వాత దాన్ని రూ.2 వేలకు పెంచుకున్నం. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం పెరిగింది కాబట్టి.. ఎన్నికల తర్వాత ఆసరా పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచబోతున్నామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించి.. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మందికి కళ్ల అద్దాలు ఇచ్చామని వివరించారు. ప్రభుత్వం చేసిన మార్పులతో ప్రైవేటు దవాఖానల కంటే ప్రభుత్వ దవాఖానల్లనే ప్రసవాలు ఎక్కువ అవుతున్నాయన్నారు. వ్యవసాయ స్థిరీకరణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు.