దేశంలో అనేక విషయాల్లో మనం నంబర్ వన్ : సీఎం కేసీఆర్
CM KCR Speech In Jagtial Meeting. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్నారు.
By Medi Samrat Published on 7 Dec 2022 3:46 PM ISTరాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్నారు. హెలీకాప్టర్ ద్వారా జగిత్యాలకు చేరుకున్న సీఎం కేసీఆర్.. మొదట నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకు ముందు కార్యాలయం వద్ద గులాబీ జెండాను ఎగుర వేశారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యాలయంలో పార్టీ జిల్లాశాఖ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును సీట్లో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత సీఎం వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. చాంబర్‌లోని సీట్లో కలెక్టర్ జీ రవిని కూర్చోబెట్టి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు.
ఆపై మోతె శివారులో జరుగుతున్న బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 62 వేల కోట్ల బడ్జెట్ ఉంటే.. ఈసారి రూ. 2 లక్షల 20 వేల కోట్లు దాటిపోనుందని పేర్కొన్నారు. మంచి చక్కటి పరిపాలన భవనాన్ని నిర్మించుకుని నా చేతుల మీదుగా ప్రారంభించుకున్నందుకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన కలెక్టరేట్‌లలో ఇది 14వ కలెక్టరేట్. మిగతావికి కూడా త్వరలోనే ప్రారంభం చేసుకోబోతున్నాం అని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో చాలాసార్లు మీ దగ్గరికి వచ్చాను. రాజకీయ నాయకులుగా ఉద్యమం చేసే సందర్భంలో మీరు కూడా పెన్ డౌన్ చేసి తెలంగాణ కోసం పోరాటం చేశారు. తెలంగాణ ఏర్పడుతుంది. దీనికి మంచి అవకాశాలు ఉన్నాయి. ధనిక రాష్ట్రం అవుతుందని నాడే చెప్పాను. అత్యుత్తమ శాలరీలు వస్తాయని చెప్పాను. అది నిజమైంది. ఎవర్నీ వదలకుండా అన్ని వర్గాలు.. ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రం ఏర్పడప్పుడు అనిశ్చిత స్థితి. కరెంట్ బాధలు, సాగునీళ్లు లేవు. వలసలు, కరువు. కారు చీకట్లలాంటి పరిస్థితి. కానీ అన్ని సమస్యలను అనతి కాలంలోనే అధిగమించామని చెప్పారు. అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలతో చర్చించి, సరైన అంచనాలు వేసి రాష్ట్రం యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించుకున్నామని కేసీఆర్ తెలిపారు. దేశంలో అనేక విషయాల్లో మనం నంబర్ వన్ ఉన్నాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాలను జీఎస్‌డీపీలో, పంటల ఉత్పత్తి, తలసరి విద్యుత్ వినియోగంతో పాటు అనేక రంగాల్లో నంబర్ వన్‌గా ఉన్నాం. ఇదంతా సాధ్యమైందంటే ఒక కేసీఆర్, ఒక సీఎస్, మంత్రులతో కాదు మనందరి సమష్టి కృషి అని పేర్కొన్నారు.