దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది
CM KCR Speech In Huzurabad. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ
By Medi Samrat Published on 16 Aug 2021 3:52 PM ISTహుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభమైంది. శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా శాలపల్లిలో నిర్వహించే దళిత బంధు ప్రారంభోత్సవ సభకు సీఎం చేరుకున్నారు. జై భీమ్ అంటూ కేసీఆర్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దళితబంధు పథకంతో దళితులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుబంధు పథకంతో వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. రైతుబంధు పథకంతో తెలంగాణ రైతుల్లో ధీమా పెరిగిందని, రైతు బీమా పథకం కూడా విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గానికి 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. నియోజకవర్గంలో 21 వేల కుటుంబాలు ఉన్నట్లు లెక్క ఉన్నదని.. ఇంకో రెండు మూడు వేల కుటుంబాలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. మొదటగా రూ.500 కోట్లు ఇచ్చాం.. రాబోయే 15 రోజుల్లో ఇంకో 2 వేల కోట్లు ఇస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా దళితబంధు పథకం వర్తింపజేస్తామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రైతు బంధు తరహాలో దళిత బంధు కూడా అందరికీ వర్తింస్తుందని.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి భూమి ఉన్నవారికి రైతు బంధు వచ్చినట్టే.. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబానికి కూడా దళిత బంధు వస్తుందని వెల్లడించారు
తెలంగాణ సాధనలో తొలి నుంచి కరీంనగర్ జిల్లా ముందుందన్న కేసీఆర్ దళితబంధు ప్రభుత్వ కార్యక్రమం కాదని.. ఇది మహా ఉద్యమమని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వల్ల దళితబంధు ఆలస్యమైందని, దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. తెలంగాణ సాకారమైనట్లే దళితుల అభివృద్ధి కూడా జరగాలని కోరారు. ఇదిలావుంటే.. సభా ప్రాంగణానికి దళితులు భారీగా తరలివచ్చారు. లక్షా ఇరవై వేల మందికి సిట్టింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. హుజురాబాద్ నియోజకవర్గములోని ప్రతి గ్రామం నుండి ఐదు బస్సులు, బస్సుకు 60 మంది చొప్పున సభకు అధికారులు తరలించారు. వివిధ జిల్లాల నుంచి 825 బస్సులు, 500 పైగా ఇతర వాహనాల్లో సభా ప్రాంగణానికి భారీగా జనం తరలించారు.